హస్తిన టూర్ లో కెసిఆర్

 


 
జాతీయ స్థాయిలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాజకీయ, అర్థిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశం కానున్నారు.
దేశంకోసం వీర మరణం పొందిన సైనిక కుటుంబాలను ఆదుకోనున్నారు. వ్యవసాయం రైతుల హక్కుల కోసం పోరాడి కేంద్రాన్ని నిగ్గదీసి సంచలనం సృష్టించిన జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలను కలిసి సీఎం పరామర్శించనున్నారు.
సీఎం పర్యటన వివరాలు:
----------------------------------
శుక్రవారం 20.05.2022 నుండి  సీఎం శ్రీ కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు. ఢిల్లీలో ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమౌతారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చించనున్నారు. అదే సందర్భంగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టు ప్రముఖులతో సీఎం సమావేశాలు నిర్వహిస్తారు.
మే 22వ తేదీన మధ్యాహ్నం ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి చంఢీఘర్ పర్యటన చేపడతారు. గతంలో ప్రకటించిన విధంగా జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను సీఎం పరామర్శిస్తారు. వారికి ఆర్థికంగా భరోసానందించేందుకు ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేస్తారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఢిల్లీ సీఎం శ్రీ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం శ్రీ భగవంత్ మాన్ సింగ్ లతో కలిసి సీఎం శ్రీ కేసీఆర్ చేపడతారు. సంచలనం సృష్టించిన రైతు ఉద్యమంలో అసువులు బాసిన పంజాబ్, హర్యాన, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన రైతుల కుటుంబాలకు చెక్కులను అందచేస్తారు.
26 మే ఉదయం శ్రీ కేసీఆర్ బెంగళూరు పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మాజీ భారత ప్రధాని శ్రీ దేవగౌడ కర్నాటక మాజీ ముఖ్యమంత్రి శ్రీ కుమారస్వామితో సమావేశమౌతారు.
బెంగుళూరు నుంచి మే 27వ తేదీన రాలేగావ్ సిద్ది పర్యటనను చేపట్టనున్నారు. అక్కడ ప్రముఖ సమాజిక ఉద్యమకారుడు శ్రీ అన్నా హజారేతో సీఎం భేటీ అవుతారు. అటునుంచి సాయిబాబా దర్శనం కోసం సీఎం షిరిడీ వెళతారు. అక్కడనుంచి పర్యటనలను ముగించుకుని తిరిగి హైదరాబాద్ కు సీఎం చేరుకుంటారు.
అటు తర్వాత మే 29 లేదా 30 న బెంగాల్, బీహార్ రాష్ట్రాల పర్యటనకు సీఎం సంసిద్దం కానున్నారు. గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను సీఎం పరామర్శిస్తారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా వారి కుటుంబాలను సీఎం ఆదుకోనున్నారు.
#KCR #Telangana

Post a Comment

Previous Post Next Post