యాదగిరిగుట్ట మునిసిపల్ వార్డుల పునర్విభజన జరగాలి.
పట్టణం శివారు ప్రాంతాలకు విస్తరించింది.
రోడ్డు విస్తరణతో నివాస గృహాలు మారినఓటర్లు
గతంలోపంచాయతీ ఓటరులిస్టు ప్రకారమే ఎన్నికలు
గ్రామ పంచాయతీ గా ఉన్న యాదగిరిగుట్ట ను 2018 లో ప్రక్కనే ఉన్న దాతరుపల్లి రెవెన్యూ గ్రామంలోని హంలేట్ అయిన పెద్దిరెడ్డి గూడెం, పాతగుట్ట ప్రాంతాలను కలుపుతూ మునిసిపాలిటీగా మార్చారు. అప్పుడు గ్రామ పంచాయతిలో 18 వార్డులు ఉండగా, వాటిని మునీసిపాలిటీ లో 12 వార్డులుగా విభజించారు. ఇందులో మహిళలకు 50% రిజర్వేషన్ ఇస్తూ ప్రభుత్వం మొదటి సారి 22 జనవరి, 2020 లో యాదగిరిగుట్ట కు మునిసిపల్ ఎన్నికలు నిర్వహించింది. మునిసిపల్ చైర్ పర్సన్ పదవి బీసీ మహిళ కు రిజర్వ్ చేయడంతో ఎరుకల సుధా మహేందర్ గౌడ్ యాదగిరిగుట్ట తొలి మునిసిపల్ చైర్ పర్సన్గా, తొలి మహిళ మునిసిపల్ చైర్ పర్సన్ గా రికార్డులోకి ఎక్కిన విషయం తెలిసిందే. గత జనవరి నాటికి యాదగిరిగుట్ట మొట్ట మొదటి మునిసిపల్ పాలకవర్గం సమయం కూడా పూర్తి అయ్యింది.
యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం తో గడిచిన 5 సంవత్సరాలలో యాదగిరిగుట్ట లో భౌగోళికంగా చాలా మార్పులు జరిగాయి, ముఖ్యంగా, పట్టణం శివారు ప్రాంతాల వైపు అన్నీ వైపులా విస్తరించడంతో కొత్త నివాస గృహాలు రావడంతో కొత్త ఓటర్లు చేరడం, లేదా వార్డులు మారడం జరిగింది. దశబ్దాల తరువాత పట్టణం లో రోడ్డు విస్తరణ జరగడంతో రోడ్డు విస్తరణ లో నివాసం కోల్పోయిన ఓటర్లు పట్టణం లోని ఇతర ప్రాంతాలకు తరలివెళ్లడంతో ఇప్పుడు పాత ఓటరు లిస్టు ప్రకారం ఓటర్లను గుర్తించడం చాలా కష్ట సాధ్యమైన పని. ముఖ్యంగా మెయిన్ రోడ్డు, మల్లాపూర్ రోడ్డు, గాంధీనగర్, హనుమాన్ వాడ, నల్లపోచమ్మ వాడ తదితర ప్రాంతాలలో నివసించిన ఓటర్లు అక్కడ వారి నివాస గృహాలు మొత్తం తొలగించడంతో ఇప్పుడు వేరే ప్రాంతాలలో నివసిస్తున్నారు. వాళ్ళ పాత వార్డుల ప్రకారం, పాత ఇంటి నెంబర్ ల ప్రకారం వారికి ఓటు ఇస్తే వారిని వెదకడం ఒక వైపు కష్టమైతే, వారు నివసించే వార్డులో కాకుండా ఇంకో వార్డు లోని కౌన్సిలర్ ను ఎన్నుకోవడం ఇరువురికీ ఎలాంటి ప్రయోజనాలు చేకూరదు, వారి సమస్యల పరిష్కారం కూడా జరగదు.
గతంలో మొదటి సారి జరిగిన మునిసిపల్ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఓటరు లిస్టు ప్రకారమే వార్డుల విభజన చేసి జరిగాయి. అప్పటికి ఇప్పటికీ ఓటరు లిస్టు ప్రకారం, భౌగోళిక ప్రకారం చాలా తేడాలు ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా, వార్డు ల పునర్విభజన కొత్త గా జరగాల్సిన అవసరం ఉంది. ఓటర్లును పాత ఓటరు లిస్టు ప్రకారం కాకుండా ఇప్పుడు వారు నివసిస్తున్న ఇంటి నెంబర్ ల ప్రకారం గుర్తించవలసిన అవసరం ముంది. రాబోయే మునిసిపల్ ఎన్నికలను, తప్పులు లేకుండ కొత్త వోటర్ లిస్ట్ తో, కొత్త వార్డులతో నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.