మహిళలకు ఉచిత ప్రయాణం - రేపటి నుంచే - ఆర్టీసీ ఎండి సజ్జానార్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ బస్సుల్లో శనివారం నుంచి మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు #TSRTC ప్రకటించింది. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్ సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చని వెల్లడించింది. హైదరాబాద్ లో నడిచే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ ల్లోనూ ఉచిత ప్రయాణం వర్తిస్తుందని తెలిపింది. మహిళలతో పాటు బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్ లు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ అమలుపై శుక్రవారం హైదరాబాద్ లోని బస్ భవన్ లో ఉన్నతాధికారులతో కలిసి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ గారు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మహిళలకు ఉచిత ప్రయాణ మార్గదర్శకాలను వివరించారు. 

హైదరాబాద్ లోని అసెంబ్లీ ప్రాంగణంలో శనివారం (తేది:09.12.2023) మధ్యాహ్నం 1:30 గంటలకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. సీఎం గారు ప్రారంభించగానే శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్ ప్రయాణం మహిళలకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. 


 *మహిళలకు ఉచిత ప్రయాణ మార్గదర్శకాలివే!* 

 -పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తింపు 

-తెలంగాణ రాష్ట్ర నివాసిత మహిళలకే ఉచిత ప్రయాణం వర్తింపు 

-స్థానికత ధ్రవీకరణ కోసం గుర్తింపు కార్డులను ప్రయాణ సమయంలో కండక్టర్లకు చూపించాలి 

-కిలోమీటర్ల ప్రయాణ పరిధి విషయంలో ఎలాంటి పరిమితుల్లేవు. 

-ప్రయాణించే ప్రతి మహిళకు జీరో టికెట్ మంజూరు చేయబడుతుంది. 

-అంతర్రాష్ట్ర సర్వీసులకు తెలంగాణ పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణం వర్తింపు. 

“కొత్తగా కొలువుదీరిన రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. శనివారం (తేది:09.12.2023) నుంచే ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ పూర్తిస్థాయిలో సన్నద్దమైంది. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే దాదాపు 40 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లతో శుక్రవారం ఉదయం, మధ్యాహ్నం రెండు సార్లు వర్చువల్ గా సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణ మార్గదర్శకాలను వారికి వివరించాం.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ గారు తెలిపారు. ఉచిత ప్రయాణంతో బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశమున్నందున, బస్ స్టేషన్ల నిర్వహణపై దృష్టి సారించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఉచిత ప్రయాణం అమలులో ప్రతి సిబ్బంది క్రమశిక్షణతో వ్యవహారించాలని, ఓపిక, సహనంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. గత రెండేళ్లుగా సిబ్బంది ప్రవర్తనలో మార్పు వచ్చిందని, దాని వల్లే సంస్థ రెవెన్యూ పెరిగిందని గుర్తుచేశారు. అదే స్పూర్తితో ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలందరూ టీఎస్ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో టీఎస్ఆర్టీసీ సీవోవో డాక్టర్ వి.రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, పురుషోత్తం, కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, పైనాన్స్‌ అడ్వైజర్‌ విజయ పుష్ఫ, సీఎంఈ రఘునాథరావు, సీటీఎం జీవన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Free Buses to Ladies in Telangana w.e.f 09-12-2023
#tsrtc #sajjanar @tsrtcmdoffice #telangana #hyderabad

Post a Comment

Previous Post Next Post