India's First Brahmana Sadan in Hyderabad | ధూపదీప నైవేధ్య పథకం అర్చకులకు నెలకు రూ.10,000 | దేశంలోనే మొట్ట మొదటి బ్రాహ్మణ సదనం

👉దేశంలోనే మెట్టమొదటిసారి నిర్మించిన తెలంగాణ “బ్రాహ్మణ సదనం”

👉వేద శాస్త్ర పండితులకు ప్రతి నెలా గౌరవ భృతిని రూ.2,500 ల నుంచి రూ.5,000 లకు పెంపు.

👉ఈ భృతిని పొందే అర్హత వయస్సును 75 ఏండ్ల నుండి 65 ఏండ్లకు తగ్గింపు.

👉రాష్ట్రంలో 6,441 దేవాలయాలకు ధూపదీప నైవేధ్య పథకం.

👉ఈ పథకం కింది అర్చకులకు నెలకు ఇచ్చే రూ.6 వేలను రూ.10 వేలకు పెంపు.

👉వేద పాఠశాలల నిర్వహణకు రూ.2 లక్షలను ఇకనుంచి వార్షిక గ్రాంటుగా ఇస్తాం.

👉విప్రహిత బ్రాహ్మణ సదనం హైదరాబాద్ లో 9 ఎకరాల స్థలంలో రూ.12 కోట్ల తో నిర్మాణం

👉ఏడాదికి 100 కోట్ల రూపాయల నిధులు బ్రాహ్మణ పరిషత్కు కేటాయింపు. 

బ్రాహ్మణ సమాజం సంక్షేమం కోసం దేశంలోనే మెట్టమొదటిసారి నిర్మించిన తెలంగాణ బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ఘనంగా జరిగింది. బ్రాహ్మణ సమాజ సంక్షేమాన్ని కాంక్షిస్తూ వారికోసం ఒక కేంద్రం ఏర్పాటు కావడం దేశంలోనే ప్రప్రథమం. అన్ని రంగాల మాదిరే బ్రాహ్మణ సంక్షేమంలోనూ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది.

గోపనపల్లిలోని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో నిర్మించిన 'విప్రహితబ్రాహ్మణ సంక్షేమ సదనం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు పాల్గొన్నారు. ముందుగా యాగశాలకు చేరుకొని, ప్రారంభోత్సవానికి దేశం నలుమూలలనుంచి ఆహ్వానం మేరకు హాజరై ఆసీనులైన పీఠాధిపతుల వద్దకు వెళ్లి వారిని పేరు పేరునా పలకరించి వారి ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఎంకు వారు కిరీటం ధరింపచేసి, దుశ్శాలువాలు కప్పిసాంప్రదాయ పద్దతిలో శంఖం పూరించి వేదమంత్రాలతో సిఎంకు ఆశీర్వచనాలందించారు.


అక్కడనుంచి ప్రాంగణంలోనే మరో పక్కకు ఆసీనులైవున్న వేదపండితుల దగ్గరకు వెళ్లి వారి యోగక్షేమాలను తెలుసుకుని వారి దీవెనలూ సిఎం తీసుకున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి ఆహ్వానితులుగా వచ్చిన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ నేతలను కలిసి వారితో కాసేపు మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుకున్నారు.

అనంతరం ప్రాంగణంలో కొనసాగుతున్న చండీయాగం, సుదర్శనయాగం, వాస్తుపూజ కార్యక్రమాల్లో సిఎం పాల్గొన్నారు. యాగ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న సందర్భంలో వేదమంత్రాల నడుమ కొనసాగిన పూర్ణాహుతి కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. దాంతో నిన్నటి నుంచి కొనసాగుతున్నపూజాకార్యక్రమాలు ముగిసాయి.

అనంతరం అన్ని హంగులతో నిర్మాణం పూర్తి చేసుకున్న బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలోని కళ్యాణ మండపాన్ని సిఎం తన చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికవద్దకు సిఎం చేరుకున్నారు. ఉదయం 11.35 నిమిషాలకు తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు శ్రీ కెవి రమణాచారి సభను ప్రారంభించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతకుమారి కోరగా సిఎస్ ప్రారంభోపన్యాసంతో సభ ప్రారంభమైంది. అనంతరం ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు కేరళకు చెందిన శ్రీ ప్రదీప్ జ్యోతి మాట్లాడారు. దేశంలోనే మరెక్కడాలేని విధంగా అత్యంత గొప్పగా బ్మాహ్మణ సంక్షేమం కోసం కృషి చేస్తున్నఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. బ్రాహ్మణ సమాజ సంక్షేమం పట్ల ఆలోచన చేస్తూ పలు పథకాలను అమలు చేస్తున్న ఒకే ఒక ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారేనని స్పష్టం చేస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

బ్రాహ్మణ సంక్షేమ సదనంప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ గారి ప్రసంగం - ముఖ్యాంశాలు:

ఈనాటి శుభసందర్భాన్ని పురస్కరించుకొని తమ ఆశీస్సులను ఆడియో సందేశం ద్వారా మనకందించినటువంటి, ఆశీర్వదించినటువంటి శ్రీ విధుశేఖర భారతీ స్వామి శృంగేరి పీఠం వారికి, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి కంచికోటి పీఠం వారికి, వారి చరణ పద్మాలకు వందనాలు. అనేక పీఠాల నుంచి విచ్చేసినటువంటి పీఠాధిపతులందరికి చరణాభి వందనాలు.

సభలో ఆశీనులైన విప్రవర్యులు, బ్రాహ్మణోత్తములందరికీ వందనాలు.

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల నుంచి విచ్చేసిన అర్చకులకు ఈ పవిత్ర తెలంగాణ భూమి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను.

బ్రహ్మజ్ఞాన వాంస్తు బ్రాహ్మణ: అని నిర్వచనం చెప్పారు పెద్దలు... బ్రహ్మజ్ఞానం పొందినవారికెవరికైనా బ్రాహ్మణత్వం సిద్ధిస్తుంది.

వేద వాజ్మయాన్ని లోకానికి అందించేవారే విప్రులు.

సర్వజన హితం సర్వజనుల సుఖం బ్రాహ్మణుల యొక్క లక్ష్యం.

పురం యొక్క హితం కోరేవారే పురోహితులు.

లోకా సమస్త సుఖినోభవన్తు అన్నది బ్రాహ్మణుల నోట పలికే జీవనాదర్శం.

బ్రాహ్మణుల మనసు, మాటా, చేసే పని లోకహితం కోసమే.

తెలంగాణ ప్రభుత్వ విధానం సర్వజన సమాదరణ, పేదరికం ఎవరి జీవితాల్లో ఉన్నా వారిని ఆదుకోవాలనే మానవీయ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే.

కులానికి పెద్దలైనా బ్రాహ్మణుల్లోనూ ఎందరో పేదలున్నారు. వారిని ఆదుకోవడం ప్రభుత్వం తన బాధ్యతగా భావించింది.

• ‘తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ను తెలంగాణ ప్రభుత్వం 2017 ఫిబ్రవరి 1 ఏర్పాటు చేసింది.

ఏడాదికి వందకోట్ల రూపాయల నిధులను బ్రాహ్మణ పరిషత్కు కేటాయిస్తున్నాం. ఈ నిధులతో వివిధ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి.

విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థులకు... ఇప్పటివరకూ 780 మంది విద్యార్థులువివేకానంద స్కాలర్షిప్' ద్వారా ఆదుకోబడ్డారు.

పేద బ్రాహ్మణుల జీవనోపాధి నిమిత్తం బెస్ట్ (బ్రాహ్మణ ఎంపవర్మెంట్ స్కీం ఆఫ్ తెలంగాణ స్టేట్) అనే పథకం అమలవుతున్నది. ఈ పథకం కింద పెట్టుబడి సాయం కింద గరిష్టంగా రూ.5 లక్షల గ్రాంటును ప్రభుత్వం అందిస్తున్నది. ఇందుకోసం ఇప్పటివరకూ రూ.150 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది.

• ‘విప్రహిత బ్రాహ్మణ సదనం’.. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో 9 ఎకరాల స్థలంలో రూ.12 కోట్ల రూపాయల వ్యయంతో అద్భుతంగా బ్రాహ్మణ సంక్షేమ సదనంనిర్మించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.

ఈ విధంగా ఇంత ఖర్చుతో సనాతన సంస్కృతి కేంద్రంగా బ్రాహ్మణ సదనంను నిర్మించిన మొట్టమొదటి ప్రభుత్వం దేశంలో తెలంగాణ ప్రభుత్వం.

ఈ బ్రాహ్మణ సదనం ఆధ్యాత్మిక, ధార్మిక, వైదిక కార్యక్రమాల నిర్వహణకు మార్గదర్శిగా, కేంద్రంగా నిలుస్తుంది.

రాష్ట్రానికి విచ్చేసే పీఠాధిపతులు, ధర్మాచార్యుల విడిది కేంద్రంగా ఈ సదనం సేవలు అందించబడుతుంది.

పేద బ్రాహ్మణ కళ్యాణాలకు ఉచితంగా ఇచ్చే వేదికగా ఈ భవనంలోని కళ్యాణ మండపం ఉపయోగపడుతుంది.

కులమతాలకు అతీతంగా పేదవాళ్లు ఎవరైనా సరే తమ ఇంట్లో శుభాశుభ కార్యక్రమాల కోసం పురోహితుల సేవలను కోరితే ఈ సదనం నుండి పురోహిత బ్రాహ్మణులు వెళ్లి ఉచితంగా వారి ఇంట్లో కార్యక్రమాన్ని జరిపించి రావాలని నేను కోరుతున్నాను.

ఆ విధంగా విప్రహిత, సకల జనహితగా సమాదరింపబడాలని, విఖ్యాతి పొందాలన్నదే నా వ్యక్తిగత అభిమతం.

వివిధ క్రతువులు, ఆలయ నిర్మాణాలు, ఆగమశాస్త్ర నియమాలు, దేవతా ప్రతిష్టలు వివిధ వ్రతాలకు సంబంధించిన ఒక సమగ్రమైన లైబ్రరీ ఈ సదనంలో ఏర్పాటు కావాలని కోరుతున్నాను.

ఆయా వైదిక కార్యక్రమాలకు సంబంధించిన అరుదైన పుస్తకాలు, డిజిటల్ వీడియోలు ఈ లైబ్రరీలో లభిస్తాయి.

వేదశాస్త్ర విజ్ఞాన భాండాగారంగా, ఆధ్యాత్మిక చైతన్య కేంద్రంగా, నిత్యం భారత, భాగవత, రామాయణాది కావ్య ప్రవచనాలకు వేదికగా, కళలకు కొలువుగా బ్రాహ్మణ సదనం విలసిల్లాలి.

సూర్యాపేటలో డాక్టర్ ఎ. రామయ్య గారు వదాన్యతతో ఇచ్చిన ఒక ఎకరం స్థలంలో బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది. దీనిని త్వరలోనే ప్రారంభించుకుందామని సంతోషంగా నేను తెలియజేస్తున్నాను.

ఖమ్మం, మధిర, బీచుపల్లి ప్రాంతంలో కూడా బ్రాహ్మణ భవనాలను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తూ ఉన్నది.

తన సంజీవని వ్యాఖ్యతో మహాకవి కాళిదాసు సాహిత్య ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహామహోపాధ్యాయుడు కోలాచలం మల్లినాథ సూరి పేరున ఆ మహనీయుని స్వస్థలమైన మెదక్ జిల్లా కొల్చారంలో సంస్కృత విశ్వ విద్యాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తుందని మీ అందరి హర్షామోదాల మధ్య తెలియజేస్తున్నాను.

బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించుకున్న నేటి శుభసందర్భంలో బ్రాహ్మణ సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న మరిన్ని నిర్ణయాలను మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను.

ప్రస్తుతం బ్రాహ్మణ పరిషత్ ద్వారా వేద శాస్త్ర పండితులకు ప్రతి నెలా ఇస్తున్న గౌరవ భృతిని రూ.2,500 ల నుంచి రూ.5,000 లకు పెంచుతున్నాం.

ఈ భృతిని పొందే అర్హత వయస్సును 75 ఏండ్ల నుండి 65 ఏండ్లకు తగ్గిస్తున్నాం.

ప్రస్తుతం రాష్ట్రలోని 3,645 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం వర్తిస్తున్నది.

రాష్ట్రవ్యాప్తంగా మరో 2,796 దేవాలయాలకు కూడా ధూపదీప నైవేధ్యం పథకాన్ని విస్తరింపజేస్తాం.

దీంతో రాష్ట్రంలో 6,441 దేవాలయాలకు ధూపదీప నైవేధ్య పథకం కింద నిర్వహణ వ్యయం అందుతుంది.

ఇప్పటివరకూ ధూపదీప నైవేధ్యం పథకం కింది దేవాలయాల నిర్వహణ కోసం అర్చకులకు నెలకు రూ.6 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తున్నది. ఈ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతున్నాం.

ఈ నిర్ణయం మీ అందరినీ కూడా ఎంతో సంతోషపెడుతుందని నేను భావిస్తున్నాను.

వేద పాఠశాలల నిర్వహణకు ఇస్తున్న రూ.2 లక్షలను ఇకనుంచి వార్షిక గ్రాంటుగా ఇస్తాం.

ఐటిఎం, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా వర్తింపచేసే నిర్ణయాన్ని కూడా తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను.

అదేవిధంగా అనువంశిక అర్చకుల సమస్యలను త్వరలో కేబినేట్ లో చర్చించి పరిష్కరిస్తామని హామీనిస్తున్నాం.

సనాతన ధర్మ పరిరక్షణ నిలయంగా వేద పురాణేతిహాసాల విజ్ఞాన సర్వస్వాల ..వైదిక క్రతువుల కరదీపికగా, పేద బ్రాహ్మణుల ఆత్మ బంధువుగా, లోక కళ్యాణకారిగా తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ఆధ్వర్యంలో ఈ విప్రహిత వెలుగొందాలని ఆ దేవదేవున్ని ప్రార్థిస్తున్నాను.

మీరు నిత్యం పలికే లోకహితకరమైన శాంతి మంత్రంతో నా ఉపన్యాసాన్ని విరమిస్తాను.

ధర్మస్య విజయోస్తు!

అధర్మస్య నాశోస్తు

ప్రాణీషు సద్భావనాస్తు

విశ్వస్య కళ్యాణమస్తు!!..

ఓం శాంతి..శాంతి..శాంతి..

ఈ సందర్భంగా ప్రాంరభోత్సవ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు:

పీఠాధిపతులు:

విశాఖపట్టణం శారదాపీఠం నుంచి స్వరూపానందేంద్రస్వామి, పుష్పగిరి పీఠం నుండి విద్యానృసింహ భారతీస్వామి, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం నుంచి సుభుధేంద్ర తీర్థస్వామి, మదనానంద సరస్వతీ పీఠం నుండి మాధవానంద స్వామి, హంపీ విరూపాక్షపీఠం నుంచి విద్యారణ్య భారతీ స్వామి, ధర్మపురి పీఠం నుండి సచ్చిదానంద సరస్వతీ మహాస్వామి, హైదరాబాద్ కు చెందిన జగన్నాథ మఠం నుంచి వ్రతధర రామానుజ జీయర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

అఖిల భారత బ్రాహ్మణ పెడరేషన్ నుంచి అధ్యక్షులు ప్రదీప్ జ్యోతి ప్రధానకార్యదర్శి ప్రధమ్ ప్రకాశ్ శర్మ, కోశాధికారి కేశవరావు సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలనుంచి వచ్చిన ఫెడరేషన్ ఆఫీసు బేరర్లు పాల్గొన్నారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, తదితర రాష్ట్రాలనుంచి వేదపండితులు ఆహ్వానితులుగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మికాంతరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వాణీదేవి, దేశపతి శ్రీనివాస్, వేదపండితుడు మృత్యుంజయ శర్మ, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ఒడితెల సతీశ్, బాల్క సుమన్, మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలచారి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి, అధికారులు ప్రభుత్వ ప్రధాన సలహాదారులు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సిఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ గణపతి రెడ్డి, టిఎన్జీవో మాజీ అధ్యక్షులు దేవి ప్రసాద్, జస్టిస్ భాస్కర్ రావు,మాజీ డిజీపిలు అరవిందరావు, అనురాగ్ శర్మ, అష్టావధాని మాడుగుల నాగఫణి శర్మ, తదితరులు పాల్గొన్నారు.

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు డా.కేవీ రమణాచారి, ఉపాధ్యక్షులు వనం జ్వాలా నరసింహారావు, సభ్యులు డా. సముద్రాల వేణుగోపాలాచారి, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, వి మృత్యుంజయ శర్మ, పురాణం సతీష్, మరుమాముల వెంకట రమణ శర్మ, బోర్పట్ల హనుమంతా చారి, అష్టకాల రామ్మోహన్, భధ్రకాళి శేషు, సుమలతా శర్మ, సువర్ణ సులోచన, జోషి గోపాల శర్మ, పరిషత్ సభ్య కార్యదర్శి వి. అనిల్ కుమార్, పాలనాధికారి రఘురామశర్మ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హాజరైన పీఠాధిపతులను సిఎం ఘనంగా సత్కరించారు.

Brahmana Sadanam at Telangana | Brahmana Sadanam at Hyderabad | 100 Crores for Brahmana Welfare | KCR | Telangana 

Post a Comment

Previous Post Next Post