హైద‌రాబాద్‌-వ‌రంగ‌ల్ పారిశ్రామిక కారిడార్‌ ఉపసంహరణ!

హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి లో ఉన్న పట్టణాలు, గ్రామాలను అనుకోని  పారిశ్రామిక కారిడార్‌ గా అభివృద్ది చేసి ఈ ప్రాంతంలోని రైతులకు, నిరుద్యోగులకు ఉపయోగ పడేలా పరిశ్రమల స్థాపన జరగాలని గత ప్రభుత్వం హైద‌రాబాద్‌-వ‌రంగ‌ల్ పారిశ్రామిక కారిడార్‌ ని ప్రకటించింది. అయితే కొత్త గా వచ్చిన ప్రభుత్వం రాష్ట్రంలో మరికొన్ని కొత్త ప్రతిపాదనలు చేస్తూ, హైద‌రాబాద్‌-వ‌రంగ‌ల్ పారిశ్రామిక కారిడార్‌ని ఉపసంహరించుకొని నూత‌న ప్ర‌తిపాద‌న‌లు పంపేందుకు అనుమ‌తించాల‌ని కేంద్రాన్ని కోరింది.

 

హైద‌రాబాద్-విజ‌య‌వాడ వ‌యా మిర్యాల‌గూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ కు ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

హైద‌రాబాద్‌-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు కేంద్ర ప్ర‌భుత్వం తుది అనుమ‌తులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రం తుది అనుమ‌తులు మంజూరు చేస్తే రాష్ట్రానికి రూ.2,300 కోట్లు విడుద‌లవుతాయ‌న్నారు.
 
కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయ‌ల్‌తో ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి శ్రీ భ‌ట్టి విక్ర‌మార్క ఆయ‌న కార్యాల‌యంలో ఈరోజు స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి సంబంధించిన ప‌లు స‌మ‌స్య‌ల‌ను ముఖ్య‌మంత్రి, కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 
 
హైద‌రాబాద్‌-వ‌రంగ‌ల్ పారిశ్రామిక కారిడార్‌లో ప్రాధాన్య అంశంగా ఫార్మా సిటీని గ‌త ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించింద‌ని, దానిని ఉపసంహ‌రించుకొని నూత‌న ప్ర‌తిపాద‌న‌లు పంపేందుకు అనుమ‌తించాల‌ని కేంద్ర మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు.
 
యూపీఏ ప్ర‌భుత్వ హ‌యాంలో హైద‌రాబాద్‌కు నేష‌న‌ల్ డిజైన్ సెంట‌ర్ (ఎన్ఐడీ) మంజూరు చేసింద‌ని, నాటి కేంద్ర మంత్రి శ్రీ ఆనంద్ శ‌ర్మ దానికి శంకుస్థాప‌న చేశార‌ని ముఖ్య‌మంత్రి, కేంద్ర మంత్రి గోయ‌ల్‌కు గుర్తు చేశారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఎన్ఐడీని విజ‌య‌వాడ‌కు త‌ర‌లించార‌ని, ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌కు ఎన్ఐడీ మంజూరు చేయాల‌ని కోరారు.
 
ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న‌ప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం నెల్లూరు జిల్లాకు మెగా లెద‌ర్ పార్క్ మంజూరు చేసింద‌ని కేంద్ర మంత్రితో ముఖ్య‌మంత్రి అన్నారు. క‌రీంన‌గ‌ర్‌, జ‌న‌గాం జిల్లాల్లో లెద‌ర్ పార్క్ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన భూములున్నాయ‌ని, కేంద్ర ప్ర‌భుత్వం మెగా లెద‌ర్ పార్క్ మంజూరు చేస్తే వెంట‌నే భూమి కేటాయిస్తామ‌ని కేంద్ర మంత్రికి ముఖ్య‌మంత్రి తెలిపారు. ఇది మంచి ప్ర‌తిపాద‌న అని, ఇందుకు సంబంధించిన అంశాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలంటూ కేంద్ర మంత్రి స‌మావేశంలో పాల్గొన్న కేంద్ర అధికారుల‌కు సూచించారు. 
 
కేంద్ర ప్ర‌భుత్వం పీఎం మిత్ర ప‌థ‌కంలో భాగంగా వ‌రంగ‌ల్‌లోని మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు బ్రౌన్ ఫీల్డ్ హోదా ఇచ్చింద‌ని, దానికి గ్రీన్‌ఫీల్డ్ హోదా ఇవ్వాల‌ని కేంద్ర మంత్రిని ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థించారు. బ్రౌన్‌ఫీల్డ్ నుంచి గ్రీన్ ఫీల్డ్‌కు మార్చితే పార్క్‌కు గ్రాంట్ల రూపంలో అద‌నంగా రూ.300 కోట్ల నిధులు వ‌స్తాయ‌ని, ఇది అక్క‌డి ప‌రిశ్ర‌మ‌ల‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. టెక్నిక‌ల్ టెక్స్ టైల్స్ (బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, క‌న్వేయ‌ర్ బెల్టులు, ఎయిర్ బ్యాగ్‌లు త‌దిత‌రాలు) టెస్టింగ్ సెంట‌ర్ల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింద‌న్నారు. ఈ విష‌యంలో తెలంగాణ ఇప్ప‌టికే సంసిద్ధ‌త వ్య‌క్తం చేసినందున రాష్ట్రానికి Centre of Excellence for Technical Textiles/Testing Centre మంజూరు చేయాల‌ని కోరారు. 
 
తెలంగాణకు జాతీయ చేనేత సాంకేతిక కేంద్రం (IIHT) మంజూరు చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో ఏడు చేనేత క్లస్టర్స్ ఉన్నాయని, ఐఐహెచ్‌టీ మంజూరు చేస్తే నేత కార్మికులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ఆదాయాలు పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. ఐఐహెచ్‌టీ ఎక్స్‌టెన్ష‌న్ సెంట‌ర్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి సానుకూల‌త వ్య‌క్తం చేశారు.
 
కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల నుంచి రాష్ట్రానికి రావల్సిన నిధులు విడుద‌ల చేయాల‌ని, రాష్ట్ర అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని ముఖ్య‌మంత్రి కేంద్ర మంత్రిని కోరారు. రాష్ట్రాభివృద్ధికి స‌హ‌క‌రిస్తామ‌ని కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ అన్నారు. ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి శ్రీ భ‌ట్టి విక్ర‌మార్క‌ల‌కు కేంద్ర మంత్రి అభినంద‌న‌లు తెలిపారు.
స‌మావేశంలో కేంద్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి శ్రీ బాలాజీ, కేంద్ర జౌళి శాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శి శ్రీ రోహిత్ క‌న్స‌ల్‌, రాష్ట్ర జౌళి, చేనేత శాఖ డైరెక్ట‌ర్ శ్రీమతి అలుగు వ‌ర్షిణి, టీఎస్ఐఐసీ సీఈవో శ్రీ మ‌ధుసూద‌న్‌, ఢిల్లీ తెలంగాణ భ‌వ‌న్ ఓఎస్డీ శ్రీ సంజ‌య్ జాజు, రెసిడెంట్ క‌మిష‌న‌ర్ శ్రీ గౌర‌వ్ ఉప్ప‌ల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
#Revathreddy Telangana CMO #Telangana #Warangal #Hyderabd 

Post a Comment

Previous Post Next Post